విశాఖనగరంలోని ఆరిలోవ ప్రాంతం దీన్‌దయాల్‌పురం వద్ద బీఆర్‌టీఎస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. ఆరిలోవ ఎస్‌ఐ గోపాలరావు తెలిపిన వివరాలివీ.. పెందుర్తి దరి సుజాతనగర్ ప్రాంతం పాపయ్యరాజుపాలేనికి చెందిన సత్యవేణి ఆమె చిన్న కుమార్తె మౌనిక తో కలసి ద్విచక్రవాహనంపై నగరానికి వచ్చారు.
తిరిగి హనుమంతవాక, పెదగదిలి, సింహాచలం మీదుగా బీఆర్‌టీఎస్‌లో పెందుర్తి వెళ్లడానికి బయలుదేరారు. చినగదిలి దాటిన తర్వాత దీన్‌దయాల్‌పురం వద్ద హెల్త్‌సిటీలో క్యూ1 ఆస్పత్రి ఎదురుగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్రవాహనం నడుపుతున్న మౌనిక వీఐపీలకు కేటాయించిన సెంటర్ రోడ్డులో ప్రయాణిస్తున్నారు. అదే రోడ్డులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. కిందపడిన మౌనిక, ఆమె తల్లి సత్యవేణిలు తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో సంఘటన స్థలంలోనే మౌనిక ప్రాణాలు విడిచింది. సత్యవేణిని ఆరిలోవ పోలీసులు హెల్త్‌సిటీలో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ గోపాల్ తెలిపారు. సత్యవేణి పెద్ద కుమార్తె తేజస్విని, భర్త శ్రీరాములున్నారు. శ్రీరాములు హుకుంపేటలో ఉద్యోగం చేస్తున్నారు.