బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఎట్టకేలకు ఒక శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కరోనా వైరస్ సోకిన తన భార్య, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య ఇంటికి చేరారని ప్రకటించారు. తాజాగా వారిద్దరికీ నిర్వహించిన కోవిడ్-19 నిర్దారిత పరీక్షల్లొ నెగిటివ్ అని తేలడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారంటూ ట్వీట్ చేశారు. అయితే తన తండ్రి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తాను మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు.
కాగా అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్యకు ఇటీవల కరోనా సోకడంతో హాస్పిటల్లో చేరారు. కరోనా పాజిటివ్ వచ్చి హోంక్వారంటైన్లో ఉన్నప్పటికీ, అనారోగ్య కారణాల రీత్యా హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. దీనికిముందే సీనియర్ బచ్చన్, అభిషేక్‌కు కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం నానావతి హాస్పిటల్లో చేరారు. అయితే అమితాబ్ భార్య, నటి జయాబచ్చన్, మిగతా కుటుంబ సభ్యులకు నెగటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.