ఖమ్మం జిల్లా తల్లాడలో ఘోరం జరిగింది. దండెంపై ఇంట్లో బట్టలు ఆరేస్తున్న క్రమంలో తల్లీకొడుకులు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన బిల్లుపాడులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వాన జల్లులు పడుతున్న క్రమంలో బయట ఆరేసిన బట్టలను తీసుకొచ్చి ఇంట్లో ఇనుప తీగ దండెంపై వేస్తుండగా తల్లికి కరెంట్ షాక్ తగిలింది.. ఆమెను రక్షించే ప్రయత్నంలో కుమారుడు ముందుకెళ్లగా.. షాక్‌తో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
డీబీ కాలనీకీ చెందిన షేక్ నసీమూన్ కూలీ పని చేస్తూ ఉంటుంది. శుక్రవారం పనికి వెళ్లి ఇంటికొచ్చాక రాత్రి వాన పడుతోందని బయట ఉన్న బట్టలను తీసి ఇంట్లోని ఇనుప వైరు దండెంపై వేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కరెంట్ సర్వీసు వైరు పక్కనే ఉండడంతో దాని నుంచి దండెం వైరుకు కరెంట్ ప్రసారమై షాక్‌కు గురైంది.ఈక్రమంలోనే ఆమె కింద పడినప్పుడు మట్టికుండకు తగిలి అది పగిలి నీళ్లు నేలపై పరుచుకున్నాయి.
ఇంతలో తల్లి అరుపులు విన్న పెద్ద కుమారుడు షేక్ సైదా వచ్చి ఆమెను రక్షించేందుకు పట్టుకోగా.. అతడికీ షాక్ తగిలింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, 15 ఏండ్ల కిందే నసీమూన్ భర్త యాకుబ్ కూడా మరణించాడు. ఇటు అమ్మ, అన్న ఇద్దరూ మృతి చెందడంతో ఇంటర్ చదివే చిన్న కుమారుడు, కూతురు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.