పిల్లలని కొట్టి చంపిన తల్లి !

Mother Attack On Sons In Peddapalli

కంటి పాపలా కన్నబిడ్డలను కాపాడుకోవాల్సిన కన్నతల్లె తన పిల్లల పాలిట మృత్యువులా మారింది. కర్కశత్వంగా ప్రవర్తించి అభం శుభం తెలియని తన ఇద్దరు కొడుకులను ఇటుకరాయితో మోది చంపేసింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. తల్లిదాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారులు వేర్వేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక బాలుడు ముందు ప్రాణాలు కోల్పోగా కొన్ని గంటల తరవాత రెండో బాబు కూడా ప్రాణాలు కోల్పోయాడు. గోదావరిఖనిలోని సప్తగిరి కాలనీకి చెందిన బద్రి శ్రీకాంత్ (35), రమాదేవి (32) దంపతులకు ఇద్దరు కుమారులు అజయ్ (10), ఆర్య (6) ఉన్నారు. పట్టణంలోని మైనారిటీ గురుకులంలో శ్రీకాంత్ పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా మానసికస్థితి సరిగాలేని రమాదేవి తరచూ భర్తతో గొడవపడేదని చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి గాను ఆదివారం రాత్రి శ్రీకాంత్ గురుకులానికి వెళ్లారు. సోమవారం ఉదయం రమాదేవి తన ఇద్దరు పిల్లలపై ఇటుకరాయితో దాడి చేసింది. గురుకులం నుంచి ఇంటికి వచ్చిన శ్రీకాంత్ రక్తపుమడుగులో పడి ఉన్న చిన్నారులను చూసి పెద్దగా కేకలు వేశారు. దీంతో అక్కడకు వచ్చిన స్థానికులు పిల్లలను ఆస్పత్రికి తరలించారు. అజయ్ గోదావరిఖని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్య మరణించాడు. రమాదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మానసిక స్థితి బాలేని తల్లి అభం శుభం తెలియని ఇద్దరి పిల్లలు ప్రాణాలుతీయడం సంచలనంగా మారింది.