మంచిర్యాల జిల్లా కేంద్రంలో తల్లీకూతుళ్లు హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ లింగయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పూదరి విజయలక్ష్మి (47) ఆమె కూతురు రవీనా (23) స్థానిక బృందావన్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. విజయలక్ష్మి భర్త శంకర్ సింగరేణిలో ఉద్యోగం చేసేవాడు. అనారోగ్యంతో ఆయన ఏడేళ్ల క్రితం మృతిచెందాడు.
కాగా, హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే రవీనాకు నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని శంకర్‌నగర్‌కు చెందిన కాలేరు అరుణ్‌కుమార్‌తో ఫేస్బుక్ పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారి, పెళ్లివరకు దారితీసింది. గత ఏడాది జూన్‌లో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో రవీనా భర్తను వదిలేసి, తల్లి వద్ద ఉంటోంది. గత ఫిబ్రవరిలో రవీనా అరుణ్‌కుమార్‌పై వరకట్నం కేసు పెట్టింది.
తర్వాత అరుణ్‌కుమార్.. విజయలక్ష్మి, రవీనాపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో మనస్తాపం చెందిన తల్లీకూతుళ్లు ఈనెల 8న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అరుణ్‌కుమార్‌పై మరో కేసు నమోదైంది. ఈ క్రమంలో గురువారం వాంగ్మూలం ఇచ్చేందుకు చెన్నూరు కోర్టుకు వెళ్లివచ్చారు. అంతలోనే తెల్లవారేసరికి హత్యకు గురయ్యారు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. ఎవరైనా దొంగతనానికి వచ్చి హత్య చేసి ఉంటారా, లేక దగ్గరివాళ్లు ఎవరైనా ఈ పనిచేసి ఉంటారా.. అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.