పోలీసుల నిర్లక్ష్యం తల్లీకూతుళ్లను ఆత్మహత్యకు ప్రేరేపించింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు బాధ్యులైన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే వీరిద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వివరాలు.. అమేథి జామో ప్రాంతానికి చెందిన గుడియాకు పొరుగువారితో మురికి కాల్వకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో గత నెల 9న ఇద్దరికి గొడవ జరిగింది. దాంతో ఇరు పక్షాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా పొరుగువారు తమను బెదిరిస్తున్నారంటూ గుడియా పోలీసులకు తెలిపింది. కానీ వారు పట్టించుకోలేదు. దాంతో పోలీసులు పొరుగువారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని.. తన ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని గుడియా ఆవేదనకు గురయ్యింది.
ఈ క్రమంలో శుక్రవారం కుమార్తెను తీసుకుని రాష్ట్ర అసెంబ్లీ సమీపంలోని లోక్ భవన్ దగ్గరకు వెళ్లింది. అక్కడే రోడ్డు మీద తల్లీకూతుళ్లిద్దరు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయలైన గుడియాను, ఆమె కుమార్తెను లక్నో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఇందుకు కారణమయిన జామో ఇంచార్జ్ పోలీసు అధికారితో పాటు మరొకరిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన పట్ల విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.