విదేశాల్లోని కొడుకు కోసం తల్లి ఆత్మహత్య

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. కెనడాలో ఉద్యోగం చేస్తున్న కొడుకు మార్చిలో ఇంటికి వస్తానన్నాడు. అయితే కరోనా ప్రభావం, లాక్ డౌన్ వీటితో రాలేకపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన తల్లి లక్ష్మి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

అయితే విదేశాల్లో ఉన్న కుమారుడు లాక్‌డౌన్‌ వల్ల ఇంటికి రాలేక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లక్ష్మి, బాలరాజు దంపతులు కొన్నాళ్లుగా చిక్కడపల్లి వివేక్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరి కుమారుడు సతీష్‌కుమార్‌ కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. మార్చి నెలలో హైదరాబాద్‌ వస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆనందంతో వేచి చూస్తున్నారు. ఉన్నట్టుండి లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో సతీశ్‌కుమార్ స్వదేశానికి వచ్చేందుకు ఆటంకం ఏర్పడింది.

దీంతో లక్ష్మి కొడుకుపై బాగా బెంగ పెట్టుకుంది. ఎలాగైనా ఇంటికి వచ్చేయాలంటూ కొడుకును రోజూ రోధిస్తూ మాట్లాడేది. అయితే విమాన రాకపోకలు నిలిచిపోవడం, తాను రాలేకపోతున్నానని లాక్‌డౌన్ ఎత్తేయగానే వస్తానని సతీశ్ చెప్పడం వంటివి నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పొలం పనులు చూసుకోవడానికి బాలరాజు రాజన్న సిరిసిల్లలోని స్వగ్రామానికి రెండ్రోజుల క్రితం వెళ్లాడు. దీంతో ఒంటరిగా ఉన్న లక్ష్మి తీవ్ర మనోవేదనకు లోనై విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.