ఓ తల్లి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. హృదయ విదారకంగా మారిన ఈ ఘటన కొమ్మూరు, ఏపూర్, హస్నాబాద్ గ్రామాల్లో విషాదం నింపింది. బంధువుల కథనం ప్రకారం .. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఏపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (28)ను నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన సత్యప్పతో పదేళ్ల కిందట వివాహం చేశారు. పెళ్లి నాటి నుంచి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.
ఈ క్రమంలో వారు పలుమార్లు కోస్గి, హస్నాబాద్ తదితర గ్రామాలకు పని నిమిత్తం వచ్చేవారు. వారికి రజిత (8), అనిత (6), రాజు (4) ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు తలెత్తాయి. అత్తింట వేధింపులు అధికం కావడంతో మనస్తాపం చెందింది. గురువారం రోజు కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. ఇంటి సమస్యలతో సతమతమైన ఆమెకు బతుకు భారంగా అనిపించింది. బతకడం ఇష్టం లేక కొమ్మూరు గ్రామం నుంచి కోస్గికి వచ్చి అక్కడి నుంచి హస్నాబాద్‌కు చేరుకుంది. హస్నాబాద్ గ్రామ శివారులో ఉన్న చెరువు దగ్గరకు పిల్లలతో కలిసి వెళ్లింది. రజిత, రాజు చేతులను చున్నితో కట్టి చెరువులో తోసింది.
ఈ విషయం గమనించిన మరో కూతురు అనిత అక్కడి నుంచి పారిపోయింది. హస్నాబాద్ గ్రామానికి చేరుకొని గ్రామస్తులకు విషయం చెప్పింది. గ్రామస్తులు అక్కడకు చేరుకునే లోపు ఎల్లమ్మ కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి రాజు మృత దేహం ఒడ్డుకు వచి్చంది. తల్లి కూతుళ్ల శవాలు కనిపించకపోవడంతో శుక్రవారం ఉదయం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగి్నమాపక సిబ్బంది సహకారంతో వెతికారు. చెరువులో చెట్టుకు తగిలి ఉన్న రెండు మృతదేహలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎల్లమ్మ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేశ్వర్రావు తెలిపారు. కొడంగల్ ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి, బొంరాస్‌పేట ఎస్ఐ శ్రీశైలం, రెవెన్యూ, అగి్నమాపక సిబ్బంది పాల్గొన్నారు.