వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారంటూ.. బిడ్డలకు విషమిచ్చిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపం కులకాచి ప్రాంతానికి చెందిన జగదీష్ తాపీ మేస్త్రీ. ఇతని భార్య కార్తీక . ఈ దంపతులకు కుమార్తె కాంచన , కుమారుడు చరణ్ ఉన్నారు. బుధవారం సాయంత్రం ఆడుకుంటున్న చరణ్, కాంచన హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. దీంతో బంధువులు ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలు విష పదార్థాలు తిని ఉన్నట్లు తెలిసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో భాగంగా కార్తీకకు బంధువు సునీల్ తో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలిసింది. ఈ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ఇద్దరు బిడ్డలకు కార్తీక పాయసంలో విషమిచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించింది. వీరిలో చరణ్ మృతి చెందగా కాంచన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మార్తాండం పోలీసులు కార్తీకను గురువారం అరెస్టు చేశారు.