అమ్మ‌… ఏమ‌ని వ‌ర్ణించ‌ను

Mother's Day Special Story

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అమ్మ‌… ఈ ప‌దం గురించి… ఎంత వ‌ర్ణించినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. అమ్మ గురించి అంద‌రూ త‌ర‌చుగా చెప్పే మాట ఈ సృష్టిలో చెడ్ట స్నేహితుడు, చెడ్డ చుట్టం, చెడ్డ అక్క‌, చెడ్డ అన్న‌, చెడ్డ త‌మ్ముడు, చెల్లి, చివ‌రకు చెడ్డ నాన్న అయినా ఉంటారేమో కానీ… చెడ్డ త‌ల్లి మాత్రం లేదు. ఉండ‌దు. ఉండబోదు. దేవుడు తాన‌న్నిచోట్లా ఉండ‌లేక త‌న‌కు బ‌దులుగా అమ్మ‌ను సృష్టించాడ‌న్న నానుడిలో ఏ మాత్రం అతిశ‌యోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే… దేవుడే లేడ‌నే మ‌నిషి ఉంటాడు కానీ… అమ్మే లేద‌నే మ‌నిషి ఉండ‌డు. మ‌నిషి జీవితాంతం వెంట ఉండేది త‌ల్లి ప్రేమే. అందుకే ప్ర‌పంచం త‌ల్లికిచ్చిన గౌర‌వం మ‌రే బంధానికీ ఇవ్వ‌దు. త‌ల్లి ప్ర‌తిక్ష‌ణం ఆ బిడ్డ‌కోస‌మే ప‌రిత‌పిస్తుంటుంది. ప‌దినెల‌లు మోసీ పాలిచ్చిపెంచి..బిడ్డకెన్నో ఊడిగాలు చేస్తుంది త‌ల్లి. ఆశ‌ల‌న్ని ధార‌పోసి పెంచుకుంటుంది. అమ్మ ప్రేమ‌లో ఎలాంటి స్వార్థం ఉండ‌దు.

మ‌నం ఎలా ఉండాలో తండ్రి చెబితే… ఎలా ఉన్నామో త‌ల్లి చెబుతుందంటారు ఓ ర‌చ‌యిత‌. అహ‌ర్నిశం బిడ్డ కోసం క‌ష్ట‌ప‌డుతూ… ప్రేమానురాగాల‌తో పెంచిపెద్ద‌చేసే త‌ల్లి… ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే అన్ని క‌ష్టాల‌ను బిడ్డ సుఖం కోసం చిరున‌వ్వుతో అధిగ‌మిస్తుంది. అమ్మ లాలిపాట‌, అమ్మ ఒడి వెచ్చ‌ద‌నం, అమ్మ ఇచ్చే ఓదార్పు క‌లిగించే సంతోషానికి ప్ర‌పంచంలో మ‌రేమీ సాటిరావు. ఈ ఆదివారం మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా… తెలుగుసినిమా పాటల్లో అమ్మ గురించి క‌వులు వ‌ర్ణించిన కొన్ని వాక్యాలను ఓసారి గుర్తుచేసుకుందాం… పెద‌వి ప‌లికే మాట‌ల‌న్నింటిలో తీయ‌న ప‌దం అమ్మే… క‌దిలే దేవ‌త అమ్మ‌… కంటికి వెలుగు అమ్మ అంటాడు ప్ర‌ముఖ ర‌చ‌యిత చంద్ర‌బోస్. ఇక అమ్మ రాజీనామా సినిమాలో ఎవ‌రు రాయ‌గ‌ల‌రు అంటూ సిరివెన్న‌ల సీతారామశాస్త్రి అమ్మ గురించి వ‌ర్ణించిన తీరు అద్భుతం. ఎంత‌ పెద్ద ర‌చ‌యిత అయినా… అమ్మ అను మాట క‌న్నా క‌మ్మ‌ని కావ్యం రాయ‌లేడంటాడు సిరివెన్న‌ల‌. ఎంత పెద్ద గాయ‌కుడు అయినా అమ్మ అనురాగం క‌న్నా తియ్య‌ని రాగం పాడ‌లేడన్న‌ది ఆయ‌న అభిప్రాయం.

అంద‌రినీ క‌నే త‌ల్లి అమ్మ ఒక్క‌టేన‌ని… అవ‌తార పురుషుడైనా ఓ అమ్మ‌కు కొడుకేన‌ని, ఎంత‌టి ఘ‌న‌చ‌రిత‌కైనా అమ్మే చిరునామా అని సిరివెన్న‌ల త‌ల్లిని ప్ర‌శంసించిన తీరు అద్వితీయం… శ్రీరామ ర‌క్ష అంటూ నీళ్లు పోసి పెంచే అమ్మ‌… దీర్ఘాయుర‌స్తు అంటూ నిత్యం దీవిస్తుంద‌ని,. బ‌తుకు న‌డ‌క నేర్చుకునేది అమ్మ చేతి వేళ్ల‌తోనేని..అంత గొప్ప అమ్మ‌ను క‌న‌గ‌లిగేది మ‌రో అమ్మే అని, సృష్టిక‌ర్త బ్ర‌హ్మ‌ను సృష్టించేది కూడా అమ్మే అని, సిరివెన్నల త‌ల్లి గొప్ప‌త‌నాన్ని ప్ర‌స్తుతించాడు. ఇంకా ఎంద‌రో ర‌చ‌యిత‌లు ఎన్నో ర‌కాలుగా త‌ల్లి గురించి త‌మ అభిప్రాయాలు వ్య‌క్తంచేశారు… ఉగ్గుపోసి ఊసు నేర్పే అమ్మ‌…చేయిప‌ట్టి న‌డ‌క నేర్పే అమ్మ‌… సృష్టిలో అన్నింటిక‌న్నా గొప్ప‌ద‌ని, జ‌గంప‌లికే శాశ్వ‌త స‌త్యం ఇదేన‌ని అంటాడు మ‌రో ర‌చ‌యిత‌. బిడ్డ ప‌లికే తొలి ప‌లుకు అమ్మేన‌ని, బిడ్డ వేసే మొద‌టి అడుగుకు అమ్మ వేలే ఊతమ‌ని, అమ్మ ప్రేమ తోడుంటే కీడ‌న్న‌దే క‌నిపించ‌దని మ‌రో క‌వి వ‌ర్ణించాడు..