తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై ఈగవాలకుండా చూసుకునే నేతల్లో మోత్కుపల్లి నరసింహులు ఒకరు. అది ఒకప్పటి మాట కానీ ఇప్పుడు మాత్రం బహిష్కరణకు గురైన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుగా ఆయన మిగిలిపోయారు. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలకు దిగుతున్న విషయం తెలిసిందే.మోత్కుపల్లి రాజకీయ పయనం ఎటు ఉన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అయితే, టీఆర్ఎస్ లో చేరాలన్న ఉద్దెశ్యంతోనే మోత్కుపల్లి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని అంతా భావించారు.
కానీ, చంద్రబాబుపై ఆయన విమర్శల తీవ్రత చూస్తే మోత్కుపల్లి ఇంకేమైనా ప్లాన్ తో ఉన్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్య మోత్కుపల్లిని ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలవడం కొత్త ఊహాగానాలకు తెరతీస్తోంది. అలాగే బాబు మీద విమర్శలప్పుడే తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం తనను మానసికంగా చంపేశారన్న మోత్కుపల్లి… తాను జులై 11న తిరుమలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా స్వామి వారిని తానేం కోరుకుంటానో వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ఓటమిని తాను కోరుకుంటానని… స్వామి వారిని ఆ విధంగా మొక్కుకుంటానన్నారు. అయితే చెప్పిన మాట ప్రకారం ఇందులో భాగంగా ఇప్పటికే ప్రకటించిన విధంగా తిరుపతికి వెళుతున్నారు. ఆయన రేపు ఉదయం తిరుపతి చేరుకుని అలిపిరి నుంచి కాలి నడకన తిరుమల వెళ్లనున్నారు.
దళితులు, బలహీనవర్గాలకు చంద్రబాబు వ్యతిరేకి అని, ఆయన మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. చంద్రబాబు వ్యతిరేక శక్తులన్నీ ఏకమై రాజకీయంగా బొందపెట్టాలని ఆ దేవుడిని వేడుకుంటానని, తన 64వ పుట్టినరోజున తాను అనుభవిస్తున్న మానసిక క్షోభను, తనకు జరిగిన అన్యాయాన్ని ఆ దేవుడితో చెప్పుకునేందుకే తిరుమల వెళుతున్నట్లు తెలిపారు. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని ఆయన పేర్కొన్నారు. 12వ తేదీ తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి అన్ని విషయాలూ మాట్లాడతానని వివరించారు. మోత్కుపల్లి తిరుపతి పర్యటన నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారన్న విషయం మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.