ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బద్దలైంది. ఈప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 90 మంది గాయపడ్డారు. 900 మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఇండోనేషియా డిజాస్టర్ మైటిగేషన్ ఏజెన్సీ అధికారి అబ్దుల్ ముహారి తెలిపారు.
జావా ద్వీపంలోని అతి ఎత్తయిన సెమెరు అగ్నిపర్వతం నుంచి శనివారం నుంచే పెద్ద ఎత్తున బూడిద, తీవ్రమైన వేడి వెలువడటం మొదలైంది. 40 వేల అడుగుల ఎత్తువరకు దట్టంగా పొగ, దుమ్ముధూళి అలుముకుంది. దీంతో భయాందోళనకు గురైన తూర్పు జావా ప్రాంతంలోని చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే, విస్పోటనం అనంతరం స్థానికుల రాకపోకలకు కీలకమైన బ్రిడ్జి తీవ్రంగా దెబ్బతింది.
దీంతో ఆ ప్రాంతంలో మరికొంత మంది చిక్కుకున్నారు. బీఎన్‌పీబీ బృందాలు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా కాపాడాయి.సెమెరు విస్పోటనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఇండోనేషియాలో 130కి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందుకనే ఇండోనేషియాను ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలుస్తారు. జనవరిలో కూడా సెమెరు బద్దలవగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.