జంగారెడ్డి కన్నుమూత

జంగారెడ్డి కన్నుమూత

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ట జంగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి… హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంలో ఆయనకు ఇబ్బందికలగడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.

జంగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. జంగారెడ్డి పార్థివదేహానికి హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు పార్టీ కార్యకర్తలు నాయకులు నివాళులర్పిస్తారు.వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చందుపట్ట జంగారెడ్డి 18 నవంబర్‌ 1935న జన్మించారు.

ఆయన 1953లో సి.సుధేష్ణను వివాహం చేసుకున్నారు. జంగారెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన హన్మకొండలో నివాసం ఉంటున్నారు. 1984లో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలలో జంగారెడ్డి ఒకరు. అప్పట్లో హనుమకొండ పార్లమెంట్‌ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై భారీ మెజారిటీతో జంగారెడ్డి గెలుపొందారు. పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపొదారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్‌ సెకండరీ టీచర్‌గా పనిచేశారు.