దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులను వదలడం లేదు. ఇప్పటికే పలు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడ్డారు.
తాజాగా కాంగ్రెస్ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం కరోనా బారిన పడినట్లు సోమవారం తెలిపారు. ‘నాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్‌కు సంబంధించిన సాధారణ లక్షణాలు ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉన్నాను. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్నవారంతా వైద్యులు ఇచ్చే కరోనా సూచనలు పాటించాలని కోరుతున్నా’అని ట్విటర్లో పేర్కొన్నారు.
ఇక కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత ఇవాన్ డిసౌజా, ఆయన భార్యకు శనివారం కరోనా సోకిన విషయం తెలిసిందే. అదే విధంగా కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే పీసీ శర్మ కూడా ఇటీవల కరోనా బారినపడ్డారు.