కరోనా వైరస్ బారినపడి మరో ఎంపీ ప్రాణాలు కోల్పోయారు. కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మహమ్మారి పీడ పూర్తిగా వీడలేదు. తాజాగా గుజరాత్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు అభయ్ భరద్వాజ్ కరోనాతో కన్నుమూశారు. ఈ ఏడాది ఆగస్టులో ఆయన కరోనా బారినపడటంతో రాజ్‌కోట్‌లోని హాస్పిటల్లో ఆయనకు చికిత్స అందించారు. కానీ అక్కడ తీవ్ర ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయినా పరిస్థితి మెరుగు కాక పోవడంతో భరద్వాజ్ మంగళవారం ప్రాణాలు విడిచారు.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ కరోనాతో నవంబర్ 26న మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఒక వారంలోనే ఇద్దరు రాజ్యసభ ఎంపీలను గుజరాత్ కోల్పోయింది. ఎంపీ అభయ్ భరద్వాజ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్లో సంతాపం వ్యక్తం చేశారు. కాగా రాజ్‌కోట్‌కు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, వృత్తిరీత్యా న్యాయవాది భరద్వాజ్ ఈ ఏడాది జూలైలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.