దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సౌత్ ముంబైలోని ఓ హోటల్లో మోహన్ నిర్జీవంగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఎంపీ మోహన్‌ది ఆత్మహత్యగా భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే గుజరాతీలో రాసిన సూసైడ్ నోట్‌ను దేల్కర్ బస చేసిన గది నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎంపీ మోహన్ దేల్కర్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా 58 ఏళ్ల మోహన్‌కు భార్య కలాబెన్, ఇద్దరు పిల్లలు అభినవ్, దివిత ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో దాద్రా నగర్ హవేలి లోక్‌సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
గతంలో కూడా ఏడుసార్లు ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న మోహన్.. 2019 వరకు దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. అనంతరం ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు.
గతేడాది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో భేటీ తర్వాత దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలకు మోహన్ డెల్కర్ జేడీయూతో ఒప్పందం కుదుర్చుకున్నారు. జేడీయూకు ఆయన మద్దతు ఇవ్వడం వల్ల దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలలో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది.