బీజేపీ ఎంపీ అభయ్ భరద్వాజ్ ఆరోగ్యం విషమించింది. కోవిడ్ బారినపడడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో గత 40 రోజులుగా ఎంపీ అభయ్ గుజరాత్ రాజ్‌కోట్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్సులో చెన్నైకి తరలించారు. కృత్రిమ ఊపిరితిత్తుల సహాయంతో ఆయనకు చికిత్సనందిస్తున్నారు.
అహ్మదాబాద్ నుంచి వెళ్లిన ప్రత్యేక వైద్య బృందం ఆయన్ను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. భరద్వాజ్ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. పరిస్థితిని బట్టి ఎక్మో చికిత్స అందించే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యంపై మరికొంత సమయం గడిస్తే తప్పా ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసీయాలో ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ పటేల్ వెల్లడించారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో రాష్ర్ట బిజెపి అధ్యక్షుడు సిఆర్ పాటిల్ నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న అనంతరం అభయ్ భరద్వాజ్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అయితే వయోభారం, అంతకు ముందే ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో కోలుకోవడం కష్టతరమైంది. గత 40 రోజులుగా చికిత్స అందించినా పరిస్థితి మెరుగు అవ్వకపోగా మరింత క్షీణించింది. మరోవైపు సిఆర్ పాటిల్ కరోనా నుంచి బయటపడ్డారు. వారం రోజుల అనంతరం ఆయన అహ్మదాబాద్ లోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.