టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని తన అభిమానులను ఎప్పుడూ నిరాశపరచడు. రికార్డుల ధీరుడిగా ఆటతోనూ… ఆటోగ్రాఫ్‌ల విషయంలోనూ వారి మనసులు గెలుచుకుంటూనే ఉంటాడు. తాజాగా మరోసారి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు ధోని. ఐపీఎల్-2022 సీజన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రణాళికలు రచిస్తున్న ధోని భాయ్.. వ్యక్తిగత ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి సారించాడు. ఇందులో భాగంగా స్వస్థలం రాంచిలోని ఓ జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కెమెరా కంటికి చిక్కాడు ధోని. ఓపికగా అతడు అందిస్తున్న ఒక్కో బ్యాట్‌పై సంతకం చేస్తూ కనిపించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను నితీశ్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్న మెగా వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ ధోని దగ్గరుండి ఆక్షన్‌ను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇక రిటెన్షన్‌లో భాగంగా రవీంద్ర జడేజా, ధోని, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలను సీఎస్కే రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.