మిస్టర్ కూల్ బర్త్ డే స్పెషల్… రికార్డ్ లు ధోనీకి కొత్తేమీ కాదు

MS Dhoni Records in International Cricket

మహేంద్ర సింగ్ ధోనీ… క్రికెట్ గురించి కాస్తో కూస్తో తెలిసిన వాళ్లకు కూడా పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఎటువంటి హోప్ లేకుండా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి. కెప్టెన్‌గా భారత్‌కు తిరుగులేని విజయాలు అందించిన ఆటగాడు ధోనీ. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆలోచిస్తూ మిస్టర్ కూల్‌గా పేరొందాడు. సమర్థవంతంగా బౌలర్లను ఉపయోగించుకోవడంలో, ఫీల్డింగ్ సెట్ చేయడంలో, డీఆర్ఎస్ వాడకంలో ధోనీ తర్వాతే ఎవరైనా. వికెట్ల వెనుకాల నిలబడి వ్యూహాలు రచించడంలో దిట్ట. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ ఈరోజు 37వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధోనికి అభిమానులతో పాటు ప్రస్తుత మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ధోని పుట్టిన రోజును టీమిండియా క్రికెటర్లు ఘనంగా జరిపారు. నేడు 37వ పుట్టిన రోజు డే సందర్భంగా.. ఈ లెజెండ్ సాధించిన కొన్ని రికార్డులు మీకోసం..

భారత జట్టు తరపును 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు సారథిగా వ్యవహరించాడు.
ఈ క్రమంలోనే ఐసీసీ వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టీ 20, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను గెలిచి ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు.

టీమిండియా తరపున ఆరు వరల్డ్ టీ20 టోర్నీలకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్‌గా ధోనియే.

క్రికెట్ చరిత్రలోనే మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీ. మహీ కెప్టెన్సీలో భారత్ 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ నెగ్గింది. రెండేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్(82) చేసిన వికెట్ కీపర్‌గా ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ధోని ఈ రికార్డుని నెలకొల్పాడు.

టెస్టుల్లో భారత్‌ను నంబర్ వన్‌గా నిలిపిన తొలి కెప్టెన్ ధోనీనే. అతడి నాయకత్వంలో భారత్ ఆసీస్‌ను వైట్ వాష్ చేసింది.
అత్యధిక మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన బ్యాట్స్‌మెన్‌గానూ ధోనీ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకూ 120కి పైగా మ్యాచ్‌ల్లో మహీ నాటౌట్‌గా నిలిచాడు.

వన్డేల్లో 100+ స్టంపౌట్లు చేసిన తొలి వికెట్ కీపర్ మహీ. సంగక్కర 99 స్టంపౌట్లు చేయగా… ధోనీ 2011 వరల్డ్ కప్‌లో ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు. అన్ని ఫార్మాట్లూ కలుపుకొని ఎక్కువ స్టంపౌట్లు చేసింది కూడా ధోనీనే.

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ (183*)గా ధోనీ రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఐపీఎల్‌లో అత్యధికసార్లు ఫైనల్ చేరిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ. అంతే కాదు ఎక్కువ సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన కెప్టెన్ కూడా ధోనీనే.

అత్యధిక సిక్స్‌లు బాదిన కెప్టెన్ మహేంద్రుడు. ధోనీ 204 కొట్టగా.. తర్వాతి స్థానంలో ఉన్న పాంటింగ్ 171 సిక్స్‌లు కొట్టాడు.
ఐసీసీ ప్రతి ఏటా ప్రకటించే వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును రెండుసార్లు గెలిచిన ఏకైక క్రికెటర్‌ ధోని.

అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌ ధోని. అతని కంటే ముందు సచిన్‌ టెండూల్కర్‌(664), రాహుల్‌ ద‍్రవిడ్‌(509)లు ఉన్నారు. మొత్తంగా ఈ ఘనత సాధించిన 9వ క్రికెటర్ ధోని.

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ధోని ఉన్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రెండు సెంచరీలు నమోదు చేశాడు.

ప్రపంచ క్రికెట్లోనే అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీనే. మూడు ఫార్మాట్లూ కలిపి 331 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ ధోనీనే. మహీ నాయకత్వంలో 60 టెస్టులు ఆడిన భారత్ 27 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ధోనీ 199 మ్యాచ్‌ల్లో టీమిండియాకు నాయకత్వం వహించగా.. 110 మ్యాచ్‌లను గెలుచుకుంది. నాలుగు వన్డేల్లో ఫలితం తేలలేదు. 72 టీ20ల్లో 42 మ్యాచ్‌ల్లో మహీ జట్టును గెలిపించాడు. రెండింట్లో ఫలితం తేలలేదు.