ములాయంసింగ్ కి అస్వస్తత…స్పెషల్ ఫ్లైట్ లో ఆసుపత్రికి

mulayam singh is unhealthy

సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యం పాలుకావడంతో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. నిన్న రాత్రి లక్నో నుంచి ఓ చార్టర్డ్ విమానంలో ఢిల్లీకి చేరుకున్న ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ములాయంకు గతంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ నరేశ్ ట్రెహాన్ సలహా మేరకు ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చినట్టు కుటుంబ సభ్యుల నుండి అందుతున్న సమాచారం. నిజానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ములాయం ఇంటికెళ్లి ఆయనను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ములాయం ఇంట సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ శివపాల్ యాదవ్ కూడా ఉన్నారు. శరీరంలో చక్కెర స్థాయిలు అత్యధిక స్థాయికి చేరడంతో ఆదివారం ములాయంను రామ్‌ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండడంతో అదే రోజు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఇక  కొంత‌కాలంగా త‌ర‌చూ ఆయన అనారోగ్యానికి గుర‌వుతున్నారు. మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో ములాయం సింగ్ యాద‌వ్ అనారోగ్యానికి గురి కావ‌డం ఇది మూడోసారి. కొద్దిరోజుల కింద‌ట అధిక ర‌క్త‌పోటుకు గురై, ఆసుప‌త్రిలో చికిత్స పొందారు. తాజాగా అధిక మ‌ధుమేహానికి గుర‌య్యారు.