Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండుగా చీలిన ములాయం కుటుంబం మళ్లీ ఒక్కటయింది. తండ్రి, బాబాయ్, కొడుకుల మధ్య విభేదాలు సమసిపోయాయి. పార్టీపై ఆధిపత్యం కోసం తండ్రీ కొడుకుల మధ్య నడిచిన వారసత్వ పోరుకు దీపావళి వేడుకలు ముగింపు పలికాయి. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు అయిన ములాయం సింగ్ యాదవ్… 2012 ఎన్నికలు వరకు పార్టీని అంతటా తానై నడిపించారు. పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ ములాయంసింగే… ఎస్పీని స్థాపించిన తరువాత ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ములాయంసింగే ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ 2012 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తన వారసుడిగా కుమారుడు అఖిలేశ్ యాదవ్ ను ముఖ్యమంత్రిని చేశారు. కొన్నాళ్ల వరకు అంతా బాగానే సాగింది. పార్టీని తండ్రి, ప్రభుత్వాన్ని కొడుకు నడిపిస్తూ సమన్వయంతోనే సాగారు. ప్రభుత్వం తరపున కొడుకు చేసే ప్రతి చర్యను పార్టీ అధ్యక్షుడిగా ములాయం సమర్థిస్తూ వచ్చారు. అయితే సోదరుడు శివపాల్ యాదవ్ కు, కొడుకు అఖిలేశ్ యాదవ్ కు మధ్య గత ఎన్నికల ముందు తలెత్తిన విభేదాలు పార్టీ చీలికకు దారితీశాయి. శివపాల్ యాదవ్ కు వ్యతిరేకంగా తండ్రిని సైతం ఎదిరించారు అఖిలేశ్.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అఖిలేశ్ వర్గాలు, శివపాల్ వర్గాలు బాహాబాహీకి దిగి పార్టీ ఇమేజ్ ను దెబ్బతీశాయి. చివరకు తండ్రీ కొడుకులు పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ కోసం కోర్టును సైతం ఆశ్రయించారు. సైకిల్ గుర్తు తమకే చెందేలా కోర్టులో తండ్రిపై కేసు గెలుచుకున్న అఖిలేశ్ ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత, వరుస అత్యాచారాలు వంటి వాటికన్నా… పార్టీ విభేదాలే ఎన్నికల్లో ఎస్పీ కొంపముంచాయి. ఓటమి తర్వాత దీనిపై తండ్రీ కొడుకుల్లో అంతర్మథనం మొదలయింది. అంతర్గత కుమ్ములాటలు చేసిన నష్టంఇద్దరికీ కనువిప్పు కలిగించింది. అందుకే ఇటీవల మళ్లీ ఇద్దరూ కలిసిపోయేందుకు ఇరువైపుల నుంచీ ప్రయత్నాలు జరిగాయి. దీపావళి నాటికి అవి కొలిక్కి వచ్చి పండుగ రోజున కుటుంబమంతా ఒక్కచోట చేరింది. తొలుత ములాయం సైఫైలోని అఖిలేశ్ యాదవ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఎస్పీ నేతలతో సమావేశమయ్యారు. తర్వాత కాసేపటికి శివపాల్ యాదవ్ అక్కడకు చేరుకున్నారు.
బాబాయ్ ను సాదరంగా ఆహ్వానించిన అబ్బాయ్ ఆయన పాదాలకు నమస్కారం చేశారు. బాబాయ్ కూడా సంతోషంగా అబ్బాయ్ ను దీవించారు. తండ్రి, బాబాయ్, అబ్బాయ్ ముగ్గురూ కలిసి పార్టీ విషయాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఎస్పీని మరింత బలోపేతం చేసేందుకు మిషన్ -2019 ను తెరపైకి తెచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుక జరుపుకున్నారు. ఈ దీపావళితో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోయాయని, ములాయం సింగ్ యాదవ్ సంతోషం వ్యక్తంచేశారు. పార్టీ, కుటుంబం ఒక్కటయ్యాయని, అందరం కలిసి దీపావళి జరుపుకున్నామని తెలిపారు. ఇక్కడినుంచి కుటుంబసభ్యులంతా ఏకతాటిపై నడుస్తూ పార్టీని మరింత ఉన్నతస్థాయిలోకి తీసుకెళ్తామని ములాయం చెప్పారు.