ముంబైలో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ముంబైకర్లకు లైఫ్ లైన్ గా చెప్పుకునే మెట్రో వ్యవస్థ స్తంభించిపోయింది. ముంబై వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందుజాగ్రత్తగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాబోయే 24 గంటల్లో ముంబై, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అందెరీ వెస్ట్, విక్రోలీ, మరోల్ తో పాటు ఇతర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. వరదలు ముంచెత్తడంతో సియోన్, పరేల్, కింగ్స్ సర్కిల్, దాదర్, బైకుల్లాలు నీట మునిగాయి. భారీ వర్షాల తరుణంలో.. ముంబైలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
నగరం మొత్తం జలమయమైంది. నగరంలోని రోడ్లు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వరదల ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఓ బాలుడు గల్లంతయ్యాడు. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం రాకపోకలు సాగించాల్సిన 30 విమానాలు రద్దయ్యాయి. మరో 118 విమానాలు ఆలస్యమయ్యాయి. శాంతాక్రూజ్ ప్రాంతంలో నిన్న ఒక్కరోజే 242 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ముంబైకి వెళ్లే పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను కుదించారు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో ప్రయాణికులు రైళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. పలు ప్రాంతాల్లో రైలు పట్టాలు కూడా నీట మునగడంతో.. రైళ్ల పునరుద్ధరణ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఛత్తీస్ గఢ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.