Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సెల్ఫీ ఇప్పుడు యువతకు ఓ సరదా అయిపోయింది. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా… ఎప్పుడు పడితే అప్పుడు సెల్ఫీలు దిగుతున్నారు. ఒక్కోసారి సెల్పీ సరదా ప్రాణాల మీదకు తెస్తున్నా ఈ అలవాటు పోవడం లేదు. సెలబ్రిటీలు ఇందుకు మినహాయింపు కాదు. అభిమానులు సెల్ఫీ రిక్వెస్ట్ చేయగానే ఓకె చెప్పేస్తున్నారు. ఫంక్షన్ లు, బహిరంగ సభలు, అవార్డు కార్యక్రమాలు వంటి సందర్భాల్లో సెల్ఫీలు తీసుకుంటే ఎవరికీ నష్టం లేదు. కానీ కొందరు మాత్రం ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలకు ఫోజులిస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇలాగే విచక్షణ లేకుండా నడిరోడ్డుపై ట్రాఫిక్ లో అభిమానితో సెల్ఫీ దిగిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కు ముంబై పోలీసులు గట్టి హెచ్చరిక చేశారు. వివరాల్లోకి వెళ్తే…
ముంబై రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో వరుణ్ కారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. అదే సమయంలో ఓ ఆటో ఆయన కారు పక్కన వచ్చి ఆగింది. ఆటోలోని యువతి కారులో ఉన్న వరుణ్ ధావన్ ను చూసి సంతోషంతో సెల్ఫీ తీసుకుంటానని అడిగింది. వెంటనే అంగీకరించిన వరుణ్ కారు కిటికీలోనుంచి తల బయటకు పెట్టి మరీ తానే సెల్ఫీ తీశాడు. యువతి కూడా తన తలను ఆటోలో నుంచి బయటకు పెట్టింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పత్రికల్లో కూడా వచ్చింది. దీంతో ముంబై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ సెల్ఫీని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన పోలీసులు ఇలాంటి సాహసాలు వెండితెరపై బాగుంటాయి కానీ ముంబై రోడ్లపై కాదు అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇలాంటి సెల్పీలతో మీరు మీ జీవితాన్నే కాదు… ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. బాధ్యత గల ముంబై పౌరుడిగా, యూత్ ఐకాన్ గా ఉన్న మీ నుంచి ఇలాంటిది కోరుకోవడం లేదు. దీనికి శిక్షగా ఈ చలాన్ పంపుతున్నామని ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి పనిచేస్తే కఠిన శిక్షనే ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిపై వరుణ్ స్పందించాడు. ట్విట్టర్ లో ముంబై పోలీసులకు క్షమాపణ చెప్పాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగిఉంది కదా అని తాను అభిమాని కోరిక కాదనలేక సెల్ఫీకి అంగీకరించానని వివరణ ఇచ్చాడు. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పాడు. మొత్తానికి ముంబై పోలీసులు సెలబ్రిటీ అన్న మినహాయింపు ఇవ్వకుండా సాధారణ పౌరులలానే వరుణ్ ధావన్ ను హెచ్చరించడం అభినందనీయం.