ఓవైపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఉత్కంఠరేపుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అంతా టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుని ఫలితాల సరళి గురించి తెలుసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. కరీంనగర్ జిల్లా మంథని మునిసిపాల్టీలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఓ ఓటర్ చిత్రమైన విజ్ఞప్తి చేస్తూ ఉత్తరం రాసి బ్యాలెట్ బాక్సులో వేశాడు.
ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందంటే.. ఈ ఉత్తరం రాసింది వెన్నుముక గాయాల ద్వారా దివ్యాంగులైన వారి తరపున ఈ లెటర్ రాసారు.. కేటీఆర్ గారూ.. మా వెన్నెముక గాయాల దివ్వాంగుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. దయచేసి మా కష్టాలు తీర్చండి.. మా కష్టాలు సంగతి మీకు వివరించుకుంటాం.. దయచేసి మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇప్పించండి అంటూ ఆ ఉత్తరంలో దీనంగా వేడుకున్నారు.
మంత్రి కేటీఆర్ ను కలవాలని ఎంతగానో కోరుకుంటున్న వెన్నెముక దివ్యాంగులు.. ఆయన్ను నేరుగా కలిసే అవకాశం దొరకలేదే ఏమో.. తమకు అందుబాటులో ఉన్న ఓటు ఆయుధాన్ని ఇందుకు వాడుకున్నారు. ఓటేసే సమయంలో ఓటుతో పాటు ఈ ఉత్తరం కూడా బ్యాలెట్ బాక్సులో వేశారు. కౌంటింగ్ సమయంలో ఈ ఉత్తరం బయటపడింది. మొత్తానికి ఈ ఉత్తరం తాలూకు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే ఇలాంటి వారిని ఆదుకోవడంలో మంత్రి కేటీఆర్ కు చక్కటి ట్రాక్ రికార్డే ఉంది. ఆయన సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. తనను ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఎవరైనా సంప్రదించి తమ సమస్యలను విన్నవించుకుంటే.. వాటిని పరిష్కరించేందుకు ఆయన చొరవ చూపుతారు. గతంలో ఇలా సోషల్ మీడియా ద్వారా తనను సంప్రదించిన అనేకమందికి ఆయన సాయం చేశారు. తన మంచి మనసును నిరూపించుకున్నారు. ఇప్పుడు దివ్యాంగులు ఓటు ద్వారా తమ కోరిక వెలిబుచ్చారు. మరి ఈ ఉత్తరం కేటీఆర్ ను చేరుతుందా.. ఆయన వారి కోరిక మన్నిస్తారా చూడాలి.