తన మామ సింగరేణి ఉద్యోగి కావడంతో ఎలాగైనా దానిని చేజిక్కించుకోవాలని భావించి అందుకు అడ్డుగా ఉన్న బావమరిదిపైనే ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఐ కుమారస్వామి, ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన నీలం తిరుపతికి కుమారుడు క్రాంతికుమార్, కుమార్తె ఉన్నారు. కూతురు ఏడాది క్రితం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రేణికుంట నవీన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటినుంచి నవీన్ తిరుపతి సింగరేణి ఉద్యోగంపై కన్నేశాడు. అయితే తన కుమారుడికే ఉద్యోగం పెట్టిస్తానని చెప్పడంతో ఎలాగైనా బావమరిదిని చంపాలని స్నేహితులతో కలిసి పన్నాగం పన్నాడు.
గురువారం రాత్రి నవీన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ముల్కల్లకు వచ్చాడు. ఎదురుగా వస్తున్న క్రాంతికుమార్‌పై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. క్రాంతికుమార్ కేకలతో కుటుంబ సభ్యులు వచ్చి నవీన్‌ను అడ్డుకున్నారు. క్రాంతికుమార్‌ను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నవీన్‌ను స్థానికులు పట్టుకున్నారు. నిందితులు ముగ్గురు కారులో పారిపోతూ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో కారును అక్కడే వదిలి ఇద్దరు పారిపోయారు. మరొకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రోడ్డు పక్కన నిందితులు పడేసిన మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.