స్థానిక పొదిలి రోడ్డులో నివాసముంటున్న రమణారెడ్డి తన రెండో భార్య కెజియా, కుమారుడు రేవంత్‌పై ఆదివారం రాత్రి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రెండో భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం పొదిలి మండలం సూదనగుంట రామాపురానికి చెందిన రమణారెడ్డికి పదేళ్ల క్రితం తన అక్క కుమార్తెతో వివాహమైంది. వారికి ఒకరు సంతానం కలిగారు. అయితే దొనకొండ మండలం నారసింహనాయునిపల్లె గ్రామానికి చెందిన దారం కెజియాను ప్రేమ పేరుతో ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్న రమణారెడ్డి దర్శిలోని పొదిలి రోడ్డులో కాపురం పెట్టాడు.
వీరికి ఆరేళ్ల కుమారుడు రేవంత్ ఉన్నాడు. రమణారెడ్డి దర్శిలో సినిమా హాలు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. భార్యపై అనుమానంతో మద్యం తాగి తరచూ గొడవపడుతుండేవాడు. ఐదు రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఆదివారం రాత్రి పూటుగా మద్యం తాగి భార్యతో గొడవపడటమే కాకుండా ఆమెను హత్య చేసేందుకు ప్రయతి్నంచాడు. కుమారుడు రేవంత్‌ను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించడంతోపాటు బాలుడి శరీరానికి విద్యుత్ తీగలు చుట్టి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుని కేకలతో ఇంటి యజమాని, చుట్టు పక్కల వారు అక్కడికి రావడంతో రమణారెడ్డి పరారయ్యాడు. కెజియా, రేవంత్‌ను చికిత్స నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.