గురువారం రాత్రి నవదంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో యువకుడు చనిపోగా.. యువతి మృత్యువుతో పోరాడుతోంది. ఢిల్లీ సమీపంలోని ద్వారక సెక్టర్-23 పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. హరియాణాలోని సోనేపట్‌కు చెందిన వినయ్ దాహియా (23), యువతి కిరణ్ (19)గా గుర్తించారు. అంబర్హ గ్రామంలోని ఓ ఇంటిలో మూడు రోజుల కిందటే అద్దెకు దిగిన ఈ జంటపై గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు.
పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో వినయ్, కిరణ్‌లు ఏడాది కిందట ఇంటి నుంచి పారిపోయారు. అప్పటికి కిరణ్ మైనర్ కావడంతో ఇటీవలే వివాహం చేసుకున్నారు. మూడు రోజుల కిందటే అంబర్హ గ్రామంలోని జ్యోతి అనే మహిళ ఓ ఇంట్లో అద్దెకు దిగారు. అయితే, గురువారం రాత్రి రెండో అంతస్తులో ఉంటున్న వినయ్, కిరణ్‌లపై ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని వినయ్ పారిపోతుండగా.. వీధుల్లో వెంబడించి తుపాకితో కాల్పులు జరిపారు.
వినయ్ ఛాతీ, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లి తీవ్ర గాయాలు కాగా.. కిరణ్‌కు మెడ, చేతులపై బుల్లెట్ గాయాలయ్యాయి. ఇద్దర్నీ సమీపంలోని వెంకటేశ్వర ఆస్పత్రికి తరలించగా.. వినయ్ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కిరణ్ పరిస్తితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందజేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
కాల్పులకు శబ్దానికి చుట్టుపక్కల వాళ్లు ఇళ్ల నుంచి రావడానికి భయపడిపోయారు. ఘటన జరిగే సమయానికి డిన్నర్ చేస్తున్నామని, తొలి షాట్ శబ్దం వినపడగానే చిన్న గ్యాస్ సిలిండర్ పేలిందనుకున్నామని ఇంటి ఓనర్ అన్నారు. మూడు రోజుల కిందటే తమ ఇంట్లో అద్దెకు దిగారని, లాగేజీ వేరే ఇంట్లో ఉందని చెప్పారంది. వినయ్ ఎయిర్‌పోర్ట్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు చెప్పినట్టు తెలిపింది.