గోదావరిఖని గాంధీనగర్‌లో శుక్రవారం రాత్రి ఇద్దరి స్నేహితుల మధ్య మద్యంమత్తులో జరిగిన వివాదం హత్యకు దారి తీసింది. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు, స్థానికుల వివరాల మేరకు..జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవిముత్తారం గ్రామానికి చెందిన చెన్నూరి మధుకర్(21) మేషన్ పని చేసుకుంటూ గోదావరిఖని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. లెనిన్‌నగర్‌కు చెందిన గద్దల వంశీ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. శుక్రవారం రాత్రి గాంధీనగర్ సింగరేణి క్వార్టర్లో నివాసం ఉండే తోటి స్నేహితుడైన గడ్డం అరుణ్ అలియాస్ సోను ఇంటికి వెళ్లి మద్యం తాగారు.
మద్యంమత్తులో వంశీ, మధుకర్ మధ్య మాటమాట పెరగడంతో మధుకర్‌పై విచక్షణారహితంగా తలపై బరువైన ఇనుప సుత్తిలాంటి వస్తువుతో గద్దల వంశీ దాడిచేసి బాదడంతో మధుకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు కూపీ లాగుతున్నారు. సదరు సింగరేణి క్వార్టర్లో నివాసముండే అరుణ్‌తోపాటు, నిందితుడు గద్దల వంశీ పరారీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి పోలీసులు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వంశీ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. అయితే అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు.