చైనాలో గత కొంతకాలంగా మిస్టీరియస్ న్యూమోనియా ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. చిన్నారుల్లో రోజురోజుకు తీవ్రతరం అవుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. చైనాలో రోజురోజుకు ఈ కేసులు పెరుగుతుండటంతో భారత్‌లోని ఆరు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హరియానా, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను అప్రమత్తం చేస్తూ.. శ్వాసకోశ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయి.
ఉత్తరాఖండ్‌లోని చమోలి, ఉత్తర్‌కాశీ, పిఠోర్‌గఢ్ జిల్లాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ముఖ్యంగా శ్వాసకోశ సమస్య కేసులపై నిఘా పెట్టాలని తెలిపింది. మరోవైపు అసాధారణ శ్వాసకోశ సమస్యలతో ఎవరైనా ఆస్పత్రిలో చేరితో ఆ సమాచారాన్ని తక్షణమే రిపోర్ట్ చేయాలని హరియాణా ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది.
ఇంకోవైపు తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఇదే ఆదేశాలు జారీ చేశాయి. ఇక కన్నడ సర్కార్ సీజనల్ ఫ్లూ లక్షణాలను వివరిస్తూ ఓ అడ్వైజరీ జారీ చేసింది. మరోవైపు ఈ శ్వాసకోశ వ్యాధి పట్ల ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతూనే.. ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాజస్థాన్ ఆరోగ్యశాఖ వైద్య సిబ్బందిని ఆదేశించింది.