చెన్నైలో చోటుచేసుకున్న కాల్పులు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబంలోని ముగ్గురిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన పారిస్ కార్నర్‌లోని షావుకారుపేటలో చోటుచేసుకుంది. షావుకారుపేటలోని వినయగ మాస్త్రీ వీధిలో అపార్ట్‌మెంట్‌లో దిలీప్ తలీల్ చంద్ అనే వ్యాపారి కుటుంబం నివాసముంటుంది.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వ్యాపారి ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి కుంటుంబం మొత్తంపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో వ్యాపారి దిలీప్ తలీల్ చంద్(74),ఆయన భార్య పుష్పా భాయ్(70), కుమారుడు శిర్షిత్ (38) ఘటనాస్థలంలోనే ప్రాణాలొదిలారు. అయితే తమకు ఎలాంటి తుపాకీ కల్పులు వినపడలేదని అపార్ట్‌మెంట్ నివాసితులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని సీపీ మహేష్ కుమార్ అగర్వాల్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా కాల్పులు జరిగిన సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా వ్యాపారి ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న దుండగుడి చిత్రాన్ని పోలీసులు కనుగొన్నారు. అలాగే రాజస్తాన్‌కు చెందిన బాబుసింగ్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘాతుకానికి ఎవరు ఒడిగట్టారనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దాడికి ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. అదే విధంగా విభేదాల కారణంగా శిర్షిత్ అతని బార్య, పిల్లలతో విడిపోయినట్లు, విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లోఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.