ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దివ్యను తాను చంపలేదని, ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించపోవడంతో ఇదంతా చేశామని నాగేంద్ర తెలిపాడు. నాగేంద్ర ఇచ్చి వాంగ్మూలం ప్రకారం.. ‘మూడేళ్ల క్రితం దివ్య నాకు పరిచయమైంది. మా ఇద్దరికీ వివాహమైంది. దివ్య బలవంతం చేస్తేనే పెళ్లి చేసుకున్నా.
ఏడు నెలలుగా ఆమె నాకు దూరంగా ఉంటుంది. ఆమెతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లా. తమ పెద్దలు అంగీకరించడంలేదని చనిపోదామని దివ్య చెప్పింది. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం. ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత నా చేతిని ఎవరు కోశారో అర్థం కాలేదు’అని నాగేంద్ర పేర్కొన్నాడు.
కాగా, నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనంగా మారింది. అయితే, ప్రేమ పెళ్లి చేసుకున్న తనను దివ్య దూరం పెట్టిందని నాగేంద్ర చెప్తుండగా.. అవన్నీ అబద్ధాలని దివ్య తల్లిదండ్రులు తోసిపుచ్చారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే నాగేంద్ర ప్రేమ, పెళ్లి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తమ కూతురు ఏనాడూ ప్రేమకు సంబంధించిన విషయం చెప్పలేదని అన్నారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న నాగేంద్రను కూడా చంపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక దివ్యపై దాడి అనంతరం తానూ మెడ, మణికట్టు, పొట్ట భాగాల్లో పొడుచుకున్న నాగేంద్ర తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ కళాశాలలో దివ్య తేజశ్విని ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. నాగేంద్ర పెయింటర్.