‘ఎన్టీఆర్‌’ చిత్రంలో చైతూ

Naga Chaitanya Acting As Ntr Next Movie

తెలుగు వారి ఆరాద్య దైవం నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే నెల నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌ సినిమా కెరీర్‌ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకు సమ ఉచ్చి అయిన ఏయన్నార్‌ గురించి చెప్పాల్సిందే. ఏయన్నార్‌ జీవిత చరిత్రను తెరకెక్కించాలని పలువురు దర్శకులు భావించినా కూడా నాగార్జున అందుకు ఆసక్తిగా లేడు. అయినా కూడా ఏయన్నార్‌ పలు చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు.

ఇటీవలే సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏయన్నార్‌ తాజాగా ఎన్టీఆర్‌ చిత్రంతో రాబోతున్నాడు. మహానటి చిత్రంలో ఏయన్నార్‌గా నాగచైతన్య నటించి మెప్పించాడు. అచ్చు ఏయన్నార్‌లా ఉన్నాడు అంటూ ప్రశంసలు దక్కాయి. ఇలాంటి సమయంలోనే బాలకృష్ణ తన సినిమా కోసం కూడా ఏయన్నార్‌ పాత్రను చైతూ చేయించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. దర్శకుడు క్రిష్‌ ప్రత్యేకంగా నాగచైతన్యకు కాల్‌ చేసి మరీ తమ చిత్రంలో నటించాల్సిందిగా కోరడం జరిగింది. చైతూ కూడా అందుకు వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో చైతూ ఫుల్‌ బిజీగా ఉన్నా కూడా ఎన్టీఆర్‌ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పాడు. అయిదు రోజుల డేట్స్‌తో ఎన్టీఆర్‌ చిత్రంలో నాగచైతన్య ఏయన్నార్‌గా కనిపించబోతున్నాడు.