తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు అయిన దినకర్ రెడ్డి నిన్న మృతి చెందారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నాగంకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడైన దినకర్ రెడ్డి వైద్య వృత్తిలో ఉన్నారు. ఆయన తండ్రి నాగం జనార్దన్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాగా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున నాగర్‌కర్నూల్ నుంచి పోటీచేసిన దినకర్.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కుమారుడి కోసం తన సీటును వదులుకున్న నాగం మహబూబ్ నగర్ ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.
అయితే ఆయన రాజకేయం చూసుకుంటూనే మరోవైపు, సివిల్ కాంట్రాక్టులు కూడా చేస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో గత వారం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల మార్పిడి కోసం వైద్యులు ఏర్పాటు చేస్తుండగానే, గురువారం రాత్రి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కుమారుడి మృతితో నాగం కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నాగం కుమారుడి మృతి విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఆసుపత్రికి చేరుకుని నాగంను పరామర్శించారు.