గజల్ శ్రీనివాస్ కేసులో పోలీసుల తీరుపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఇప్పటికే గజల్ శ్రీనివాస్ ను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించని సంగతి తెలిసిందే. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు గజల్ ను నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం కోర్టు తిరస్కరించింది. గజల్ శ్రీనివాస్ ను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటని, రిమాండ్ రిపోర్టులో విచారణకు సంబంధించిన వివరాలు పొందుపరిచి, వీడియోలతో సహా అన్ని ఆధారాలు సంపాదించిన తర్వాత ఆయన్ను ఏం విచారిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఆయన్నుంచి ఎటువంటి రికవరీ అవసరంలేదని రిపోర్టులో పేర్కొన్నారు కాబట్టి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నామంది.
ఇవాళ గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగానూ పోలీసుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గజల్ శ్రీనివాస్ కు సంబంధించిన సీడీలను కోర్టుకు ఎందుకు సమర్పించలేదని, కోర్టు అనుమతి లేకుండా సీడీలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎలా పంపుతారని ప్రశ్నించింది. కేసులో ఏ2గా ఉన్న పార్వతి ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పడంపైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. ఓ వైపు మీడియాకు పార్వతి ఇంటర్వ్యూలు ఇస్తోంటే ఆమె పరారీలో ఉందని నిర్లక్ష్యంగా ఎలా సమాధానం చెప్తారని నిలదీసింది. అటు గజల్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని ప్రాసిక్యూషన్ న్యాయవాది చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.