నందమూరి సుహాసిని నామినేషన్ కు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అభినందనల ట్వీట్స్

Nandamuri Jr NTR & Kalyan Ram Tweets About Suhasini Political Entry

నందమూరి ఫ్యామిలీ నుండి మరో రాజకీయ వారసురాలు రాబోతుంది. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని. ఈమె మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి తనయుడైన చుండ్రు శ్రీకాంత్ సతీమణి. కాబట్టి, ఈమెని నందమూరి సుహాసిని అని పిలవడం కంటే చుండ్రు సుహాసిని అని పిలవడమే సబబు. హరికృష్ణ కు కూతురు ఉందని చాలామందికి ఇప్పటివరకూ తెలియని విషయం. కానీ, తెలంగాణ ఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు ఆమె పేరు నందమూరి సుహాసిని గా వెలుగులోకి వచ్చింది. సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి టీడీపీ తన పార్టీ అభ్యర్థిగా నందమూరి కళ్యాణ్ రామ్ ని నిలబెట్టాలని అనుకుంది. కానీ, ఈ విషయమై కళ్యాణ్ రామ్ నుండి సుముఖత వ్యక్తం కాకపోవడంతో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని ని ఇప్పుడు కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది.

Harikrishna And Suhasini

టీడీపీ సీనియర్ నాయకులను కాదని నందమూరి హరికృష్ణ కూతురు అయిన చుండ్రు సుహాసిని ని నందమూరి సుహాసిని గా మళ్ళీ పుట్టింటి పేరు ఇచ్చి మరీ నిలబెట్టడానికి కారణం ఏమిటా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా, నందమూరి హరికృష్ణ గారు ఈమధ్యనే మరణించడంతో, నందమూరి ఫ్యామిలీ తరపున నిలబడే వారికి సానుభూతి అనే మైలేజీ కూడా వస్తుందనే కారణం తోనే చుండ్రు సుహాసిని ని ఎన్నికల్లో నిలబెట్టారు అని అందరూ అనుకుంటున్నారు. ఇదికాక, సుహాసిని మామగారైన చుండ్రు శ్రీహరి కూడా రాజకీయనేత కావడం మరో కలిసివచ్చే అంశం.

Suhasini Political Entry

ఈరోజు కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా రానున్న తెలంగాణ ఎన్నికలలో చుండ్రు సుహాసిని మరొక్కసారి నందమూరి సుహాసిని గా నామినేషన్ దాఖలు చేయబోతుంది. ఈ సందర్భంగా ఆమె సోదరులు మరియు నందమూరి హరికృష్ణ తనయులైన జూ. ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు ట్విట్టర్ వేదికగా తమ అక్క కి శుభాకాంక్షలు తెలియజేశారు.

JR NTR Tweet

ఈ ఇద్దరు సోదరులు తమ ట్విట్టర్ అకౌంట్ లో ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో మా తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సొదరుడు కల్యాణ్ రామ్ తెలిపారు. తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తమకు ఎంతో పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ హరికృష్ణగారు సేవలు అందించిన తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు మా సోదరి సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలని నమ్మే కుటుంబం మాది.. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతోన్న మా సోదరి సుహాసినికి విజయం వరించాలని ఆకాంక్షిస్తూ జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ.. మీ నందమూరి కల్యాణ్‌రామ్, నందమూరి తారకరామారావు’ అంటూ ఒకే పోస్ట్ పెట్టి, వేర్వేరు ట్యాగ్ లైన్లతో తమ శుభాకాంక్షలు తెలిపారు.