నాగ్‌, నానిల మల్టీస్టారర్‌ టైటిల్‌ ఫిక్స్‌

nani and nagarjuna multistarrer movie title Fixed

టాలీవుడ్‌ ప్రేక్షకులు మల్టీస్టారర్‌ చిత్రాలకు బ్రహ్మరథం పడతారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమద్య అందుకే వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలకు సినీ వర్గాల వారు ఆసక్తి చూపుతున్నారు. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో నాగార్జున, నానిలు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ చిత్రం కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు ఫిక్స్‌ అయ్యారు. సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయినా, ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన టైటిల్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించలేదు.

తాజాగా ఈ చిత్రంకు ‘దేవదాసు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ టైటిల్‌తో అనేక భాషల్లో పలు చిత్రాలు వచ్చాయి. ఇక తెలుగులో కూడా అప్పట్లో ఏయన్నార్‌ హీరోగా ‘దేవదాసు’ చిత్రం వచ్చింది. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఆ చిత్రం టైటిల్‌తోనే ఆమద్య రామ్‌ హీరోగా వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో ఒక చిత్రం వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే టైటిల్‌తో నాగ్‌, నానిల మల్టీస్టారర్‌ రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రం అతి త్వరలోనే ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదో విభిన్న ప్రేమ కథా చిత్రం అవ్వడం వల్లే ఈ టైటిల్‌ను దర్శకుడు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున కూడా ఇదే టైటిల్‌పై ఆసక్తిగా ఉన్నాడు. అతి త్వరలోనే టైటిల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ చిత్రంకు పోటీగా దసరా బరిలో నిలువబోతున్న ఈ మల్టీస్టారర్‌ ఏ రేంజ్‌ సక్సెస్‌ను దక్కించుకుంటుందో చూడాలి.