తండ్రి పిలుస్తున్నాడనే…11 మందిని పొట్టన పెట్టుకున్నాడా !

Did Lalit Bhatia Hallucinate About His Dead Father's Order To Commit Suicide

దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన బురారీ భాటియా కుటుంబసభ్యుల సామూహిక ఆత్మహత్యల వెనుక కారణాలపై ఇంకా స్పష్టత రావట్లేదు. మోక్షం పొందడమే లక్ష్యంగా 11 మంది కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ.. ఇంకా అనేక అనుమానాలు రేగుతునే ఉన్నాయి. ఈ కేసులో గంట గంటకీ అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. . మొదటి నుంచి కేసులో కీలకంగా మారిన రిజిష్టర్‌లోని ప్రతుల్లోని చేతి రాతలు, మృతుల్లో ఒకడైన లలిత్‌ భాటియా చేతి రాతతో సరిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. లలిత్‌ భాటియాకు ఉన్న భ్రమలు, ఆత్మల పట్ల నమ్మకాలే అతనితో పాటు మిగతా కుటుంబ సభ్యులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులు భావిస్తున్నారు.

మృతుల్లో ఒకడైన లలిత్‌ భాటియా నారాయణ్‌ దేవి చిన్న కుమారుడు. 45ఏళ్ల లలిత్‌కు కొంతకాలం కింద ప్రమాదవశాత్తూ మాటపడిపోయింది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చివరకు దుకాణానికి వచ్చిన వారితో కూడా మూగ సైగలు, చేతి రాతల ద్వారానే సంభాషించేవాడు. ఇలాంటిది ఉన్నట్టుండి గత కొంతకాలం నుంచి భాటియా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. అది కూడా తన తండ్రి తనకు కనిపించడం మొదలుపెట్టినప్పాటి నుండి, ఇందులో కొసమెరుపు ఏంటంటే లలిత్‌ భాటియా తండ్రి పదేళ్ల క్రితమే మరణించాడు. తాజాగా పోలీసులకు లలిత్‌ భాటియాకు చెందిన ఓ డైరీ లభించింది. దాని ద్వారా కొన్ని ఆశ్చర్యకర విషయాలను పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం. ఆ డైరీలో లలిత్‌ భాటియా పదేళ్ల క్రితమే చనిపోయిన తన తండ్రి గురించి కలలు కన్నట్లుగా రాసుకున్నాడట. అందులో ఆస్తులు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతల వ్యవహారాలపై తన తండ్రి నుంచి ఆదేశాలు రావడంతో వాటిని నేరవేర్చినట్టు లలిత్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అంతేగాక.. తన తండ్రి నుంచి తనకు ఆదేశాలు వస్తున్నాయని, ఇంట్లో అందరూ వాటిని పాటించాలని లలిత్‌ ఇంట్లో వారికీ లలిత్ నూరి పోసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తండ్రి సందేశాలను రిజిస్టర్‌లో రాసి మిగతా కుటుంబ సభ్యులకు తెలిపేవాడు. అందులో భాగంగానే రిజిస్టర్‌లో ఒక చోట ‘త్వరలోనే మీ ఆఖరి కోరికలు నెరవేరతాయి. అప్పుడు ఆకాశం తెరుచుకుంటుంది. భూమి కంపిస్తుంది. కానీ ఎవరూ భయపడకండి. గట్టిగా మంత్రాన్ని జపించండి నేను మిమ్మల్ని కాపాడతాను’ అని తండ్రి తనతో చెప్పినట్లు కాగితంలో రాసి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అంతేగాక.. ఆత్మహత్యలు చేసుకోడానికి ముందు రిహార్సల్స్‌ కూడా చేసినట్లు ఆ డైరీ ద్వారా తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. ‘లలిత్‌ ఆరోగ్యం గురించి కంగారుపడకండి. నేను రావడం వల్లే అతడికి సమస్యలు’ అని లలిత్‌ తనకు తాను డైరీలో రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే.. లలిత్‌ భ్రమల వల్ల అతను చెప్పిన విషయాలను మిగతా కుటుంబ సభ్యులు కూడా నమ్మి అతడు చెప్పినట్లే ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు పోలీసులు.