Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీ నటులు : నాని, నివేద థామస్, ఆది, మురళి శర్మ
మ్యూజిక్ : గోపి సుందర్
ప్రొడ్యూసర్ : డీవీవీ దానయ్య
దర్శకత్వం : శివ
వరసగా ఆరు సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన నాచురల్ స్టార్ నాని ఎంచుకున్న ఏడో కథ ‘నిను కోరి ‘. శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడు చెప్పిన కధకు పడిపోయిన నాని వెంటనే ఓకే చెప్పేసిన ఈ సినిమా మీద ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ మధ్య కాలంలో నాని జడ్జి మెంట్ ఆ స్థాయిలో వుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన కొందరు సెలబ్రిటీ లు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ చూస్తుంటే సినిమా మీద అంచనాలు ఇంకాస్త పెరిగాయి. రానా అయితే ‘ నిను కోరి’ సినిమాలో పని చేసిన నటులు వున్న కాలంలో తానూ సినిమాల్లో పని చేస్తున్నా అని చెప్పుకునేందుకు గర్వంగా ఉందని ప్రకటించాడు. ఇక మంచు లక్ష్మి అయితే ఈ మధ్య కాలంలో నేను చూసిన అతి సున్నితమైన ప్రేమ కథ ఇది అని చెప్పేసారు. ఇక చిత్ర నిర్మాతలకి కూడా నినుకోరి, నాని మీద నమ్మకంతో రెండు రోజుల ముందే ప్రముఖుల కోసం ప్రివ్యూ షో వేశారు. ఈ మధ్య కాలంలో అంత ధైర్యం చేసిన సినిమా ఇదే. ఇక ఈ అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందో, లేదో చూద్దాం.
కథ…
నిను కోరి సినిమా కథ లో కొత్త కోణం వుంది. దీన్ని ఓ ప్రేమ కథ గా తీసుకోవచ్చు. ఇంకో యాంగిల్ లో ఫ్యామిలీ ఓరియెంటేషన్ వున్న సినిమా అనుకోవచ్చు. ఇంకాస్త విశాల దృక్పధంతో చూస్తే జీవితపు విలువని చెప్పే సందేశాత్మక చిత్రం అనుకోవచ్చు. ఇద్దరి ప్రేమకథ ఎన్ని జీవితాలతో ఎలా ముడిపడివుంటుందో దర్శకుడు శివ నిర్వాణ బాగా చెప్పగలిగాడు. నాని, నివేద కాలేజీ రోజుల్లో ప్రేమికులు. అయితే కొన్ని సంఘటనలతో వాళ్ళు బ్రేక్ అప్ చెప్పుకుంటారు. నివేద పెళ్లి అది తో జరుగుతుంది. వాళ్లిద్దరూ అమెరికాలో సెటిల్ అవుతారు. ఆ తర్వాత ఊహించని మలుపుతో ఓ పది రోజులు తమతో నాని ఉండటానికి అది ని ఒప్పిస్తుంది నివేద. అక్కడ కి వెళ్లిన నాని నివేద దంపతుల జీవితంలో తెచ్చిన మార్పులు ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే నిను కోరి చూడాల్సిందే.
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్…
పక్కింటి కుర్రోడిలా అనిపించే నాని ఈ సినిమాలో మరోసారి ప్రేమికుడి పాత్రలో కనిపించాడు. అయితే ఇది ఇంతకు ముందు లాంటి పాత్ర అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నాని నటనలో సున్నితమైన భావాలు ఎలా పలుకుతాయి అన్నది చూడాలంటే నిను కోరి చూడాల్సిందే. ఓ లవర్ బాయ్ గానే కాదు జీవితంలోని మిగతా కోణాల్ని కూడా అర్ధం చేసుకునే పాత్రలో ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ , క్లైమాక్స్ లో నాని నటనకి జై కొట్టాల్సిందే. నానికి ఏ మాత్రం తగ్గకుండా చేశారు నివేద థామస్, ఆది. నివేద రూపంలో హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు అంతకు మించి అని గర్వంగా చెప్పుకొనే నటి చిత్ర సీమకి దొరికినట్టే. ఇక ఆది గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పాత్ర తనకు బాగా నచ్చిందని నాని ఎందుకు అన్నాడో సినిమా చూస్తే అర్ధం అవుతుంది. ఆది ఓ హీరో మాత్రమే కాదు సూపర్బ్ యాక్టర్. ఇక మురళి శర్మ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఈ ముగ్గురికి దీటుగా గుర్తుండిపోయే పాత్ర చేసాడు.
సాంకేతిక నిపుణులు…
136 నిమిషాల నిడివి వున్న ఈ సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా కథని పట్టించుకోకుండా చూసినా ఫోటోగ్రఫీ నచ్చేస్తుంది. ఇక కథతో కలిసినప్పుడు ఆ ఫీల్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యింది. కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫీ, గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ . ప్రవీణ్ పూడి ఎడిటింగ్, కోన వెంకట్ స్క్రీన్ ప్లే కూడా బాగున్నాయి.
దర్శకుడు…శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడిని ‘నిను కోరి’ సినిమాకి పరిచయం చేసి నాని ఇండస్ట్రీ కి మేలు చేసాడు. గుండె లోతుల్లో నుంచి వచ్చిన కథని అదే విధంగా ఎదుటివారి ఆర్ద్రత ని తట్టి లేపేలా చెప్పడంలో శివ 100 శాతం సక్సెస్. అక్కడక్కడా కమర్షియల్ పోకడలకు అవకాశం వున్న చోట కూడా కథ, క్యారెక్టర్ లని దృష్టిలో ఉంచుకుని మాత్రమే సినిమాని నడిపాడు. ఇక ప్రేమ, జీవితం అనే అంతులేని స్కోప్ వున్న విషయాల్ని ఓ కధలో ఇమిడ్చి చెప్పడంలో శివ నైపుణ్యం ఏంటో బయటపడుతుంది. వితౌట్ ఎనీ డౌట్ చిత్రసీమకు ఇంకో మంచి దర్శకుడు దొరికినట్టే.
నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. డీవీవీ దానయ్య ఎక్కడా రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్ …
కథ, కధనం
నాని, ఆది , నివేద
మురళీశర్మ, పృద్వి.
ఫోటోగ్రఫీ
ఎడిటింగ్
మ్యూజిక్
దర్శకత్వం
మైనస్ పాయింట్స్ …
అక్కడక్కడా ఊహించే సన్నివేశాలు
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
తెలుగు బులెట్ పంచ్ లైన్: ‘నిను కోరి’ వెళ్లిన వాళ్ళు నిండుగా తిరిగి వస్తారు.
తెలుగు బులెట్ రేటింగ్: 3 .25 / 5.
More Intresting Stories: