కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఫోన్ చేసి శుభాంక్షలు తెలిపారు. ఇటు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అంతకుముందు ప్రధాని మోదీ.. ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌ చేశారు. అలాగే ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయగా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేసీఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు పలువురు జాతీయ నాయకులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా కేసీఆర్‌కు మోదీ ఫోన్ చేయడం, అసోం సీఎం కూడా విషెష్ చెబుతూ ట్వీట్‌ చేయడం ఇప్పుడు కాస్త ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు.ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సీఎం కేసీఆర్ తనయుడు.. మంత్రి కేటీఆర్, కూతురు ఎమ్మెల్సీ కవిత, హరీశ్ రావుతో పాటు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సైతం ట్విట్టర్ వేదికగా సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.