గుజ‌రాత్ ఫలితాల‌తో ప్ర‌ధాని భావోద్వేగం

Narendra Modi cries after Gujarat Elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌ధాని మోడీది నిశ్చ‌ల వైఖ‌రి. మ‌నిషికి స‌హ‌జంగా ఉండే భావోద్వేగాల‌కు తాను అతీతం అన్న‌ట్టుగా ఉంటారు. క్ర‌మశిక్ష‌ణ‌, ప‌ట్టుద‌ల‌, ధైర్యం వంటి ల‌క్ష‌ణాల‌తో గంభీర‌మైన వ్య‌క్తిగా క‌నిపిస్తుంటారు. కానీ అలాంటి నేత‌ను సైతం గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు భావోద్వేగానికి గురిచేశాయి. కాంగ్రెస్ తో చావో రేవో అన్న‌ట్టుగా త‌ల‌ప‌డి… అన్ని ప్ర‌తికూల‌త‌ల‌కు ఎదురొడ్డి నిలిచి… సొంత రాష్ట్రంలో బీజేపీని విజ‌య‌తీరాల‌కు చేర్చిన మోడీకి ఇవి ఎంత ప్ర‌త్యేక ఫ‌లితాలో… ఆయ‌న వ్య‌వ‌హార శైలి చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఢిల్లీలో జ‌రిగిన బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో పాల్గొన్న మోడీ… సొంత నేత‌ల స‌మ‌క్షంలో భావోద్వేగానికి లోన‌య్యారు.

పార్లమెంట్ లోని లైబ్ర‌రీ భ‌వ‌న్ లో జ‌రిగిన ఈ స‌మావేశానికి ప్ర‌ధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా, పార్టీ అగ్ర‌నేత ఎల్. కె. అద్వానీ, కేంద్ర‌మంత్రులు హాజ‌ర‌య్యారు. ప్ర‌ధాని హాల్ లోకి ప్ర‌వేశించ‌గానే… పార్టీ నేత‌లంతా లేచి నిల్చుని జ‌య‌జ‌య ధ్వానాలు చేశారు. అనంత‌రం మోడీ, అమిత్ షాల‌ను నేత‌లు స‌త్క‌రించారు. త‌రువాత‌ పార్టీ నేత‌లను ఉద్దేశించి మాట్లాడారు మోడీ. ఈ దేహం దేశం కోస‌మే అని ఉద్విగ్న భ‌రి వ్యాఖ్య‌లుచేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి ప్ర‌స్తావిస్తూ ఇదో పెద్ద విజ‌యంగా అభివ‌ర్ణించారు. ఇప్పుడు మ‌నం 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామ‌ని, దివంగ‌త ప్ర‌ధాని ఇందిరాగాంధీ హ‌యాంలో కాంగ్రెస్ 18 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంద‌ని మోడీ చెప్పారు. అధికారం ప్ర‌జ‌ల‌కోస‌మేన‌ని, వారిని సంతోష‌పెట్ట‌డానికేన‌ని ప్ర‌ధాని అభిప్రాయ‌ప‌డ్డారు. త‌న నుంచి ఇంకా ఎంత ప‌ని ఆశిస్తున్నారో అదంతా చేసి చూపెడ‌తాన‌న్నారు. ఈ స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడిన కేంద్ర‌మంత్రి అనంత‌కుమార్ మోడీ ప్ర‌సంగం వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌తిప‌క్షాలు చేసే అన‌వ‌స‌ర‌మైన‌, రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, అవ‌న్నీ అసంబంద్ధ‌మైన‌వ‌ని మోడీ సూచించిన‌ట్టు చెప్పారు.