Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ సింప్లిసిటీకి మారుపేరుగా ఉంటారు. తన రాజకీయ జీవితంలో ఆయన విలాసవతంతమైన జీవితాన్ని గడిపిన దాఖలాలు లేవు. ఆరెస్సెస్ కార్యకర్తగానే కాదు…బీజేపీ సీనియర్ నేతగానూ, గుజరాత్ ముఖ్యమంత్రిగానూ, ఇప్పుడు ప్రధానమంత్రిగానూ ఎప్పుడూ ఆయన విలాసాలకు దూరంగానే ఉన్నారు. అయితే ప్రధానమంత్రి ఉన్నట్టు ఆయన క్యాబినెట్ లోని మంత్రులు ఉండాలని లేదు కదా.
అందరూ కాకపోయినా కొందరు కేంద్రమంత్రులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. వారు వ్యక్తిగతంగా ఎలా ఉన్నా పర్లేదు. కానీ ప్రభుత్వ కార్యక్రమల విధుల కోసం వెళ్లినప్పుడు విలాసవంతమైన సౌకర్యాల కోసం ప్రభుత్వ నిధులు ఖర్చుపెడుతున్నారు. చాన్నాళ్లుగా మంత్రుల తీరును గమనిస్తున్న ప్రధానమంత్రి చివరకు వారికి వార్నింగ్ ఇచ్చారు. ఐదు నక్షత్రాల హోటళ్లకు అలవాటు పడొద్దు అని ప్రధాని సహచర మంత్రులకు సూచించారు. అధికారిక విధుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో కొందరు మంత్రులు ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల్లో బస చేయకుండా…విలాసవంతమైన సౌకర్యాలకు ఆశపడి… ఫైవ్ స్టార్ హోటళ్లకు వెళ్తున్నారని, వారి విలాసాలకు ప్రభుత్వ నిధులు ఖర్చుపెడుతున్నారని మోడీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయొద్దని మంత్రులను ఆదేశించారు. స్టార్ హోటళ్లలో బసచేసేవారితో పాటు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించుకుంటున్న మంత్రుల తీరుపైనా ప్రధాని మండిపడ్డారు.
ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాహనాలను కుటుంబసభ్యుల కోసం ఉపయోగించుకుంటున్నారని, ఇది సరికాదని, ఇలాంటి చర్యలను ఉపేక్షించబోనని ప్రధాని స్పష్టంచేశారు. 2019 ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్దమవుతున్న మోడీ…అవినీతి రహిత ప్రభుత్వం అనే నినాదంతో ఆ ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తున్నారు. పదేళ్ల యూపీఏ ప్రభుత్వ అవినీతిపై దేశంలో విపరీతమైన ఏహ్యభావం పెరిగిపోయి…2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఘోరంగా ఓడించారు. ఆ పరిస్థితి బీజేపీకి ఎప్పుడూ రాకూడదన్నది మోడీ ఆలోచన. అవినీతి, బంధుప్రీతి వంటి అవలక్షణాలకు దూరంగా బీజేపీ ప్రభుత్వం పేరుతెచ్చుకోవాలని కోరుకుంటున్న మోడీ తన క్యాబినెట్ మంత్రులు కూడా అలాగే నడుచుకోవాలని ఆదేశాలిస్తున్నారు.