నటీనటులు: నాగశౌర్య,కశ్మీరా పరదేశి, యామిని భాస్కర్,
దర్శకుడు: శ్రీనివాస చక్రవర్తి
నిర్మాత: నాగశౌర్య తల్లి ఉష మూల్పూరి
సంస్థ: ఐరా క్రియేషన్స్
“ఛలో” సినిమాని సొంతంగా ఐరా బ్యానర్ మీద తీసిన హీరో నాగశౌర్య సాధించిన సక్సెస్ ఈ మధ్య చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. పైగా చిత్ర పరిశ్రమకు వెంకీ కుడుముల అనే ఓ కొత్త దర్శకుడు కూడా పరిచయం అయ్యాడు.అదే ఊపులో ఇప్పుడు నాగశౌర్య సొంత బ్యానర్ లోనే చేసిన నర్తనశాల పేరు పెట్టిన దగ్గర నుంచే అంచనాలు పెంచేసింది. ఈరోజు ప్రేక్షకుల మధ్యకు వచ్చిన నర్తనశాల ఆ అంచనాలకు తగ్గట్టు వుందో, లేదో చూద్దామా ?
కథ…
కళామందిర్ కళ్యాణ్ కి తండ్రి అంటే పిచ్చి ప్రేమ. అతని తల్లి చనిపోతుంది. ఆ బాధలో వున్న తండ్రి తిరిగి సంతోషంగా ఉండాలంటే తనకు ఓ కూతురు పుట్టాలని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ బిడ్డలో తండ్రి ,తన తల్లిని చూసుకుంటాడని అతని అభిప్రాయం. అయితే అతనికి కొడుకు(నాగశౌర్య ) పుడతాడు. అయితే ఈ విషయం తండ్రికి తెలియకుండా బిడ్డకు ఆడవేషం వేసి పెంచుతుంటాడు. అయితే ఓ బుడబుక్కల వాడి జోస్యంతో ఆ గుట్టు బయటపడుతుంది. పైగా జోస్యాన్ని ఎగతాళి చేసినట్టే ఆ మొగ బిడ్డకు ఓ మొగుడు వస్తాడని కూడా బుడబుక్కల వాడు చెబుతాడు. అదెలా అనేది మిగిలిన కథ. చిన్నప్పుడు ఆడబిడ్డలా పెరిగిన నాగశౌర్య జీవితంలో ఏమి జరిగిందో నర్తనశాలలో ఉంటుంది.
విశ్లేషణ…
శ్రీనివాస చక్రవర్తి అనే కొత్త దర్శకుడు, నర్తనశాల అనే పేరు, హీరో నాగశౌర్య సొంత బ్యానర్ అని వినగానే ఎక్కడో ఓ మంచి సినిమా చూడబోతున్నాం అనే నమ్మకం. ఈ మధ్య కాలంలో కొత్త దర్శకులు సాధించిన విజయాలు కూడా అందుకు ఓ కారణం. అదే కోవలో చక్రవర్తి కూడా సినిమా ప్రారంభ దృశ్యాలతో ఆకట్టుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు హీరో ఇంట్రడక్షన్ , అతని వృత్తి కి సంబంధించిన సీన్స్ చూసినప్పుడు ఓ మంచి సినిమా కి వినోదం కూడా తోడు అయ్యిందన్న ఫీలింగ్ మొదలైంది. అయితే ఆ తెరలు ఒక్కొక్కటిగా విడిపోయి, ఓ సాదాసీదా సినిమా , పాత చింతకాయపచ్చడిలాంటి సినిమా చూస్తున్నాం అని అర్ధం అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా బోర్ ఫీలింగ్ వచ్చినా సెకండ్ హాఫ్ లో ఏదో జరుగుతుందన్న భ్రమ కలిగింది. అయితే సెకండ్ హాఫ్ లో కందిరీగ, రభస లాంటి సినిమాలు గురించి వద్దు అనుకున్నా గుర్తుకు వచ్చాయి. హీరో నాగశౌర్య నా లేక జయప్రకాశ్ రెడ్డి నా అన్నది అర్ధం కాదు.
దర్శకత్వం లో లోపాలు కొట్టొచ్చినట్టు చాలా చోట్ల కనిపించాయి. హీరో స్త్రీ పక్షపాతిగా ఉండటం, ఓ “గే “ వల్ల ఇబ్బంది పడటం వంటి సీన్స్ అనుకున్నప్పుడు కొత్త తరం ఆలోచనలు ఏవో చూస్తాం అనుకుంటే ఓ రొటీన్ ఫార్ములా సినిమాతో బోర్ కొట్టించేసాడు. కధనం , దర్శకత్వం గాడి తప్పడంతో అక్కడక్కడా కొంత వినోదం పర్లేదు అనిపించినా ప్రేక్షకుడు దాన్ని పూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితి. ఇక ఇదే లోపంతో హీరో తో కధానాయికలు, ఇతర నటీనటుల కష్టం బూడిద పాలైంది. ఇంత రొటీన్ కొట్టుడులో లో కూడా శివాజీరాజా , పూజారి ఎపిసోడ్ కొంత నయం అనిపించింది.
మొత్తానికి ఓ కొత్త పాయింట్ అనుకుని హీరోని సినిమాకి ఒప్పించడం ఒక ఎత్తు అయితే ఆ పాయింట్ కి తగ్గ కథ, కధనం లేకుండా ముందుకు వెళితే నర్తనశాల లాంటి సినిమాలు వస్తాయి. అందుకే ఐడియా తో పాటు బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటే బెటర్ అని సినీ పెద్దలు చెప్పేది.