బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఇప్పటివరకు ఫీమేల్ కంటెస్టెంట్లే ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మొదటి వారంలో సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారంలో లహరి షారి బిగ్‌బాస్ షోకు వీడ్కోలు పలికారు. ఇక ఈసారి కూడా మళ్లీ లేడీ కంటెస్టెంట్‌ను పంపించేస్తారేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడ్డాయి. చివరాఖరకు నాగార్జున నటరాజ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. మరి నటరాజ్ మాస్టర్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో చదివేయండి..
బిగ్‌బాస్ షోలోకి ఎంతో సీరియస్‌గా అడుగుపెట్టిన మాస్టర్ రానురాను జోకర్‌గా మారిపోయారు. టాస్క్‌ల్లో బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ వింత బిహేవియర్ వల్ల కమెడియన్‌గా మారిపోయాడు. నేను మోనార్క్‌ను, నా మాటే అందరూ వినాలి, కానీ నేనెవరి మాటా వినను అన్నట్లుగా ప్రవర్తించడంతో అటు కంటెస్టెంట్లతో పాటు ఇటు జనాలకు కూడా విసుగు పుట్టించాడు. పైగా నేను సింహాన్ని.. పులితో వేట, నాతో ఆట రెండూ ప్రమాదమే అంటూ డైలాగులు వదలడం, కథలు చెప్పడం కాస్త అతిగా అనిపించాయి. ఈ వింత ప్రవర్తన అతడి ఆటను, ఓట్లను దెబ్బతీసిందనేది కాదనలేని నిజం.
ఇక ఎలిమినేషన్‌కు మొదటి మెట్టు నామినేషన్. ఈ వారం విశ్వ, మానస్, హమీదా, యాంకర్ రవి.. నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశారు. ఈ క్రమంలో నటరాజ్ వాళ్లందరితోనూ తగాదా పెట్టుకుని మరింత నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. దీంతో నామినేషన్ జరిగిన నెక్స్ట్ డే నుంచే నట్టూ హౌస్‌లో కొనసాగడం డౌటే అని కామెంట్లు చేశారు నెటిజన్లు. అలాగే కొరియోగ్రాఫర్ అయిన అతడు తన డ్యాన్స్ నైపుణ్యాలను కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోయాన్నడది మరో వాదన.ప్రతిసారి పక్కవాడిని టార్గెట్ చేస్తే మొదటికే మోసం వస్తుంది.
అందుకు నటరాజ్ మాస్టర్ పెద్ద ఉదాహరణ. ఇంటిసభ్యులను జంతువులతో పోల్చడం, వాళ్లకు ఇష్టమున్నా లేకపోయినా ఎప్పటికప్పుడు కొత్త కొత్త జంతువుల పేర్లతో పిలవడం చాలామందికి నచ్చలేదు. ముఖ్యంగా తమ అభిమాన కంటెస్టెంట్లను జంతువులతో పోల్చినందుకు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నటరాజ్‌ను దుమ్మెత్తిపోశారు. హౌస్‌లో ఎవరూ ఆయనను పట్టించుకోకపోయినప్పటికీ అతడు మాత్రం అందరూ తనను టార్గెట్ చేస్తున్నారన్న భ్రమలో, బాధలోనే నాలుగువారాలు గడిపేశాడు.ఇదిలా వుంటే ఇప్పటికే ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు వరుసగా ఎలిమినేట్ అవడంతో బిగ్‌బాస్ ఆటతీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో మరోసారి ఆడవాళ్లను పంపిచేశారంటే కచ్చితంగా విమర్శలపాలవుతామని బిగ్‌బాస్ యాజమాన్యం నటరాజ్ మాస్టర్ మీద ఫోకస్ చేసి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫాలోయింగ్ తక్కువగా ఉన్న నటరాజ్‌కు అనఫీషియల్ పోల్స్‌తో పాటు అధికారిక పోల్స్‌లోనూ ఓట్లు తక్కువగా వచ్చాయని అందుకే ఆయన షోకు గుడ్‌బై చెప్పక తప్పలేదని సమాచారం. మొత్తంగా ఏదైనా సాధించాకే బయటకు వెళ్దామనుకున్న నటరాజ్ మాస్టర్ చివరకు వట్టి చేతులతోనే, అదీ నాలుగు వారాలకే షో నుంచి నిష్క్రమించడం బాధాకరమంటున్నారు అతడి ఫ్యాన్స్!