National Politics: అయోధ్యలో వెలిగిన బాహుబలి అగరుబత్తి

National Politics: Baahubali Agarubatti lit in Ayodhya
National Politics: Baahubali Agarubatti lit in Ayodhya

అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తోంది. మరో ఆరు రోజుల్లో ఆయోధ్యలో రామ్ లల్లా కొలువుదీరనున్నాడు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ దేశవ్యాప్తంగా భక్తులు పంపిన కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌లోని వడోదర నుంచి 108 అడుగుల పొడవు, 3వేల 403 కిలోల బరువైన బాహుబలి అగరుబత్తీ కానుకగా వచ్చిన విషయం తెలిసిందే.

ఇవాళ్టి నుంచి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ క్రతువులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు బాహుబలి అగర్బత్తిని వెలిగించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ జీ మహారాజ్ సమక్షంలో ఈ బాహుబలి అగరుబత్తీని భక్తులు వెలిగించారు.

గుజరాత్‌లోని వడోదరా నగర తర్సాలీ ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు అయోధ్య రామమందిరం కోసం బాహుబలి అగరుబత్తీని తయారు చేసి అయోధ్య రాముడికి కానుకగా పంపించారు. ఈ బాహుబలి అగరుబత్తీని పంచ ద్రవ్యాలతో తయారు చేసినట్లు వారు తెలిపారు. 3.5 అడుగుల చుట్టుకొలత ఉన్న దీని తయారీకి దాదాపు రెండు నెలల సమయం పట్టిందని, ఇందుకు దాదాపుగా 5 లక్షల రూపాయల ఖర్చయిందని వెల్లడించారు.