National Politics: అరుణాచల్ ప్రదేశ్ లో బోణీకొట్టిన BJP.. ఐదుగురు MLAలు ఏకగ్రీవం..!

National Politics: BJP defeated in Arunachal Pradesh.. Five MLAs are unanimous..!
National Politics: BJP defeated in Arunachal Pradesh.. Five MLAs are unanimous..!

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ బోణీ కొట్టింది. సీఎం పెమా ఖండూతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఏప్రిల్ 19న రెండు లోక్ సభ నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించిన నామినేషన్ల గడువు మార్చి 27తో ముగిసింది. సీఎం పెమా ఖండూ పోటీ చేస్తున్న ముక్తో నియోజకవర్గంతో పాటు తాలి, తాలిహా, సగలీ, రోయింగ్ నియోజక వర్గాల్లో కేవలం బీజేపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి మరికొంత మంది విత్ డ్రా చేసుకోనున్నట్టు తెలుస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్ లోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 60 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టగా.. కాంగ్రెస్ 34, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 29 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎన్సీపీ 17, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 సెగ్మెంట్లలో బరిలో నిలిచింది. రెండు లోక్ సభ స్థానాలకు 15 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41, జేడీయూ 7, ఎన్సీపీ 5, కాంగ్రెస్ 4 సీట్లలో గెలుపొందాయి. కాగా, 2016లో పెమా ఖండూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. తాజా పరిణామంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు.