ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో దీన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కమిటీలో సభ్యులుగా కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ, గిరిజన, సామాజిక న్యాయశాఖల కార్యదర్శులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ పాల్గొని ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ అమల్లో ముందడుగు పడినట్లు తెలిసింది. మోదీ హామీపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22వ తేదీన కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.