కుమార్తెలు మరణించినా పిత్రార్జిత ఆస్తిలో వారి పిల్లలకు హక్కు ఉంటుందని కర్ణాటక హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. తమ తోబుట్టువులు చనిపోయారని, వారికి గానీ, వారి సంబంధీకులకు గానీ ఆస్తిలో భాగమెందుకు ఇవ్వాలంటూ మధ్య కర్ణాటకలోని నరగుందకు చెందిన చెన్న బసప్ప హొసమఠ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ సచిన్ శంకర్ మగదం తోసిపుచ్చారు. ‘పిత్రార్జిత ఆస్తిలో హక్కు అనేది కుమార్తె, కుమారుడికి పుట్టుకతోనే వస్తుంది. కుమారుడు చనిపోయిన తర్వాత అతని వారసులకు పిత్రార్జిత ఆస్తిలో హక్కు తరహాలోనే కుమార్తెలకూ ఉంటుంది. రాజ్యాంగ సమానత్వ సూత్రాలను న్యాయస్థానాలు కాపాడుతూ, లింగ వివక్ష లేకుండా చూడాలి’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.