ఉగ్రవాది ఏ భాషలోనైనా ఉగ్రవాదే, ఏ దేశం కూడా సొంత వివరణలతో దాన్ని సమర్థించకూడదని అన్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్. మూడు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న జైశంకర్ ఆదివారం రోజున అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భారత్- రష్యా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కోతో దిల్లీకి ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో.. చైనా వైపు రష్యా మళ్లుతుందనే భావనను జైశంకర్ తోసిపుచ్చారు
తన అనుభవాలు, లెక్కల ప్రకారం.. రష్యా ఎల్లప్పుడూ భారత్తో సానుకూల సంబంధాలు కలిగి ఉందని జైశంకర్ అన్నారు. ఇరు దేశాలూ పరస్పర ప్రయోజనాలను పట్టించుకునే విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకున్నాయని తెలిపారు. రెండింటి మధ్య ఈ మాత్రం విశ్వాసం అవసరం అని అభిప్రాయపడ్డారు. ఏ దేశంతో సంబంధాలనైనా భారత్ తన కోణం నుంచే చూడాలని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా ఎన్నికల గురించి మాట్లాడుతూ.. అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా.. భారత్ కలిసి మెలిసి ఉండగలదని చెప్పారు.