National Politics: హైకోర్టు తీర్పుకు సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన కేజ్రీవాల్‌

National Politics: Kejriwal challenged the High Court verdict in the Supreme Court
National Politics: Kejriwal challenged the High Court verdict in the Supreme Court

లిక్కర్ పాలసీ వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆయన తరఫున న్యాయవాది వివేక్‌ జైన్‌ తెలిపారు.

తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైంది. ఈడీ వద్ద తగిన ఆధారాలున్నాయని.. అందుకే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్న న్యాయస్థానం .. అరెస్టు, రిమాండ్‌ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. మనీలాండరింగ్‌పై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్‌ చెప్పారని తెలిపింది. సామాన్యులకు ఒక న్యాయం, సీఎంకి మరొక న్యాయం ఉండదని తేల్చి చెప్పింది.

మార్చి 21న కేజ్రీవాల్‌ను దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీలోకి తీసుకొని విచారించగా.. ఏప్రిల్‌ 15 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైలులో ఉన్నారు.