భారత్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం అవుతోంది. కోట్ల మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న తరుణం సమీపిస్తోంది. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రాముడి గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
17వ తేదీన 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారని అయోధ్య రామ ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. 20వ తేదీన సరయూ నదీ జలాలతో రామ మందిరాన్ని శుద్ధి చేస్తారని చెప్పారు. అనంతరం వాస్తు పూజలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఇక 21వ తేదీన రామయ్య విగ్రహం సంప్రోక్షణ ఉంటుందని.. 22వ తేదీన ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని వివరించారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ అంతర్జాతీయ గాలిపటాల పండగను నిర్వహించనుంది.